: దీవించి పరీక్షకు పంపితే... ఏకంగా పెళ్లే చేసేసుకుంది
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు... ఇదొక ఆణిముత్యంలాంటి పాట. ఇలానే ఉత్తరప్రదేశ్ లోని డెహ్రాడూన్ కు చెందిన దంపతులు ఊహించని ఘటనను చూసి తెల్లబోయారు. స్థానికంగా కొత్వాలి ప్రాంతంలో నివసించే ఆ దంపతులకు 12వ తరగతి చదివే కూతురు ఉంది. పోయిన శుక్రవారం ఆమెకు వార్షిక పరీక్ష ఉంది. ఆ రోజు ఉదయం పరీక్ష బాగా రాసిరా అంటూ దీవించి పంపారు తల్లిదండ్రులు. ఆ యువతి పరీక్షకు వెళ్లకుండా పక్కింట్లో ఉండే దేవాశిష్ తో కలసి ఓ గుడికి వెళ్లి మూడు ముళ్లు వేయించుకుంది.
పరీక్షకని వెళ్లిన కూతురు సాయంత్రానికి కూడా ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు కంగారు పడి వికాస్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. తీరా తమ కూతురు పక్కింట్లోనే ఉందని తెలుసుకుని అక్కడకు వెళ్లి చూడగా... ఎరుపురంగు చీర ధరించి, నుదుటిపై సింగారపుబొట్టు, మెడలో మంగళ సూత్రంతో కనిపించింది. తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకున్నానని ఆమె తీరిగ్గా తల్లిదండ్రులకు చెప్పింది. అంతేకాదు, తనకు 19 ఏళ్లు అని, హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్నానని పోలీసులకు ఆధారాలు చూపించి, తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లనని చెప్పడంతో పోలీసులు ఆ నవ దంపతులను విడిచి పెట్టారు.