: చాంపియన్ ట్రోఫీలో భారత్ తొలి ప్రత్యర్థి దక్షిణాఫ్రికా
పరిమిత ఓవర్ల క్రికెట్ లో వరల్డ్ కప్ తర్వాత మరో భారీ టోర్నీ అయిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన తొలి మ్యాచ్ లో పటిష్టమైన దక్షిణాఫ్రికాతో తలపడనుంది. నేడు టోర్నీ షెడ్యూల్ ను ప్రకటించారు. ఇంగ్లండ్ వేదికగా ఈ మెగా ఈవెంట్ జూన్ 6 నుంచి మొదలవనుంది. కేవలం టెస్టు హోదా కలిగిన దేశాలే ఈ టోర్నీలో పాల్గొంటాయి. కాగా, భారత్ తన రెండో లీగ్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఆడనుంది.
జూన్ 15న బర్మింగ్ హామ్ లో ఈ ఆసక్తికర పోరు జరగనుంది. ప్రపంచ కప్ వేదికలపై ఇంతవరకు పాక్ చేతిలో ఓటమెరుగని రికార్డు భారత్ సొంతం. ఈ నేపథ్యంలో ఉపఖండం క్రికెట్ అభిమానులందరూ ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తుంటారనడంలో సందేహంలేదు. ఇక ఈ టోర్నీ విజేతకు రూ. 10 కోట్లు ఇవ్వనున్నారు. రన్నరప్ కు రూ. 5 కోట్లు దక్కనున్నాయి. ఇక సెమీఫైనల్స్ లో వెనుదిరిగిన జట్లకు రూ. 2.1 కోట్ల చొప్పున ఇస్తారు.