: హంస వాహనంపై విహరించిన కోదండరాముడు
తిరుపతిలో శ్రీకోదండరాముని బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం చిన్నశేష వాహనంపై ఆసీనులై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం కోదండరాముడికి ఊంజల్ సేవ నిర్వహించారు. రాత్రి హంస వాహనంపై సర్వాలంకార భూషితుడైన స్వామివారు పురవీధుల్లో విహరిస్తూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. కళాకారుల భజనల రామనామ స్మరణల మధ్య స్వామివారి హంస వాహన సేవ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, స్థానిక ఆలయాల డిప్యూటీ ఈవోలు పాల్గొన్నారు.
శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్ద శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల అధ్యాపకుడు ఎం.వి. సింహాచల శాస్త్రి బృందం నిర్వహించిన భక్తశబరి హరికథా పారాయణం వీక్షకులను అలరించింది.