: మరో వివాదంలో ఎమ్మెల్యే...గురునాథరెడ్డికి గృహనిర్బంధం
అనంతపురం జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పెద్దఎత్తున గడియారాలను దిగుమతి చేసుకున్నారన్న ఆరోపణలతో కోర్టుకు హాజరయిన ఆయన తాజాగా ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురంలో 20 వ వార్డులో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నించారు.
దీంతో ఎమ్మెల్యే గురునాథరెడ్డి, ఆయన సోదరుడు ఎర్రిస్వామిరెడ్డిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. 20 వ వార్డులో ఎమ్మెల్యే నివాసం ఉండడం, టీడీపీ మేయర్ అభ్యర్థి స్వరూప ఇదే వార్డు నుంచి బరిలో ఉండడంతో రెండు పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీంతో క్యూలైన్లో నిల్చున్న ఓటర్ల వద్దకు ఎమ్మెల్యే వచ్చి దొంగ ఓట్లు వేసేందుకు వచ్చారా? అంటూ బెదిరించే ప్రయత్నం చేశారు.
ఓటర్ల నిర్థారణ పోలింగ్ బూత్ లో ఉన్న ఏజెంట్లు, అధికారులకు సంబంధించిన అంశం అని, క్యూ లైన్లో ఉన్న వారిని బెదిరించే ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబు? అంటూ స్వరూప అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులతో కూడా ఎమ్మెల్యే సోదరులు వాగ్వాదానికి దిగడంతో వారిని ఇంటికి తీసుకెళ్లి గృహనిర్బంధం చేస్తున్నట్టు తెలిపారు.