: ఐపీఎల్ లో నవ కెరటాలొస్తున్నాయ్
కాసుల వర్షం కురిపించే టి20 టోర్నీ ఐపీఎల్ లో ఈమారు కొన్ని కొత్త ముఖాలు దర్శనమివ్వనున్నాయి. వేలం సమయంలో వీరిలో కొందరికి భారీ ధర పలకగా, మరికొందరు సాధారణ ధరకే చేజిక్కారు. ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మాక్స్ వెల్, కేన్ రిచర్డ్ సన్, నాథన్ కౌల్టర్-నైల్, జేమ్స్ ఫాక్ నర్.. వెస్టిండీస్ కు చెందిన డారెన్ సామీ, రవి రాంపాల్, శామ్యూల్ బద్రీ.. శ్రీలంకకు చెందిన సచిత్ర సేనానాయకే తదితరులు ఈసారి ఐపీఎల్ లో తమ సత్తా చాటేందుకు తహతహలాడుతున్నారు.
వీరిలో గ్లెన్ మ్యాక్స్ వెల్ ను సుమారు రూ. 5 కోట్లు వెచ్చించి ముంబయి ఇండియన్స్ చేజిక్కించుకుంది. విలక్షణ ఆఫ్ స్పిన్నర్ గా పేరుపొందిన ఈ ఆసీస్ యువ ఆటగాడు అద్భుతమైన ఫీల్డర్ కూడా. పైగా, బ్యాటింగ్ లోనూ రాణిస్తుండడంతో ముంబయి కన్ను ఈ కుర్ర ఆల్ రౌండర్ పై పడింది. అయితే, ఐపీఎల్-6లో తన విలువకు తగిన విధంగా రాణిస్తాడా? లేదా? అన్నదే ప్రశ్న.
మాక్స్ వెల్ తర్వాత ఆ స్థాయిలో ధర పలికిన మరో ఆటగాడు 21 ఏళ్ళ కేన్ రిచర్డ్ సన్. గతేడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్ లో ఆసీస్ జట్టు తరుపున అద్వితీయ ప్రదర్శన చేసిన రిచర్డ్ సన్ ను పుణే వారియర్స్ వేలంలో ఎగరేసుకెళ్ళింది. మరోవైపు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం క్రిస్ మోరిస్ ఐపీఎల్ వేలంలో రూ. 3.3 కోట్లు పలికి అందరి దృష్టిని తనవైపు మళ్ళించుకున్నాడు.
గంటకు 140 కిమీ వేగంతో బౌలింగ్ చేసే మోరిస్ కు పరిమిత ఓవర్ల క్రికెట్ కు అతికినట్టు సరిపోయే ఆటగాడని పేరుంది. పైగా, హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్ మన్ కూడానూ. ఈ ఆజానుబాహుడు తన ఆల్ రౌండ్ నైపుణ్యంతో అదరగొట్టాలని చెన్నై సూపర్ కింగ్స్ ఆశిస్తోంది. కాగా, కేవలం ఏడు వన్డేలు మాత్రమే ఆడిన శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ సచిత్ర సేనానాయకే అనూహ్యంగా కోట్లు కొల్లగొట్టాడు. గతేడాది లంక దేశవాళీ క్రికెట్ పోటీల్లో 6 మ్యాచ్ ల్లో 16 వికెట్లు తీసి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.
ఐపీఎల్ వేలంలో సేనానాయకేను కోల్ కతా నైట్ రైడర్స్ రూ. 3.3 కోట్లకు కొనుగోలు చేసింది. వీరందరితోపాటు విండీస్ ఆటగాళ్ళు సామీ, బద్రీ, రాంపాల్ లు సైతం తమ ప్రతిభతో ఆయా ఫ్రాంచైజీలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏ విధంగా నిలుపుకుంటారో చూడాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.