: మున్సి‘పోల్స్’కు ఏర్పాట్లు పూర్తి: రమాకాంత్ రెడ్డి
ఆదివారం నాడు జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాదులోని బుద్ధ భవన్ లో ఈరోజు (శనివారం) ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 10 నగర పాలక సంస్థలు, 146 పురపాలక సంఘాల్లో రేపు ఎన్నికలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ఆయన తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ చేసేందుకు ఏర్పాటు చేశామని, ముందు జాగ్రత్తగా 23,519 కేసులు నమోదు చేశామని ఆయన అన్నారు.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మే 7వ తేదీ తర్వాత ఓట్లు లెక్కించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఏప్రిల్ 6, 11 తేదీల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో అదనంగా 41 మంది డీఎస్పీలు, 50 మంది సీఐల విధులను వినియోగించుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ప్రజలు ఈ ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని ఆయన ఓటర్లను కోరారు. ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.