: విశ్వాస ఘాతుకానికి పర్యాయపదం కేసీఆర్: దామోదర
కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని తీవ్ర మోసానికి పాల్పడిన వ్యక్తి కేసీఆర్ అని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. విశ్వాస ఘాతుకానికి పర్యాయపదం ఆయనేనని ఆరోపించారు. సగం కడుపు కోసుకుని సోనియా తెలంగాణ ఇస్తే వంచనకు పాల్పడ్డారన్నారు. అయన అవకాశవాద రాజకీయాలకు ఇది నిదర్శనమని చెప్పారు. ప్రస్తుతం విశ్వసనీయతకు, విశ్వాస ఘాతుకానికి మధ్య పోటీ జరుగుతోందన్నారు. తెలంగాణలో దొరలకు, దళితులకే ఎప్పుడూ పోరాటం ఉంటుందన్నారు.
గాంధీభవన్ లో తెలంగాణ ఎన్నికల ప్రచార కమిటీ సమావేశం ముగిసిన అనంతరం దామోదర మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో సోనియా, రాహుల్ పాల్గొంటారని చెప్పిన దామోదర... సికింద్రాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మంలలో నిర్వహించే బహిరంగ సభల్లో వీరు పాల్గొంటారని వివరించారు. గెలవలేమన్న అభద్రతాభావం ఉన్న నేతలే కాంగ్రెస్ ను వీడుతున్నారని దామోదర అన్నారు.