: మచిలీపట్నం నుంచే మళ్లీ పోటీ చేస్తా: కొనకళ్ల


మచిలీపట్నం లోక్ సభ టిక్కెట్ ను తిరిగి తనకే కేటాయిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు తనకు భరోసా ఇచ్చారని ఎంపీ కొనకళ్ల నారాయణ వెల్లడించారు. విజయవాడలో ఈరోజు (శనివారం) ఆయన మీడియాతో మాట్లాడారు. నూతనంగా ఏర్పాటయ్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు కాబోయే ముఖ్యమంత్రి అని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధాని నిర్మాణంతో పాటు ఆ ప్రాంత అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ఆయన అన్నారు.

టీడీపీలో ఇతర పార్టీల నుంచి కొత్తగా వచ్చి చేరే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంటు సభ్యులు తమకు మళ్లీ టికెట్ వస్తుందో రాదో అనే సందేహంలో ఉన్నారు. నరసరావుపేట లోక్ సభ స్థానాన్ని మరొకరికి కేటాయిస్తున్నట్లు ఇప్పటి ఎంపీ మోదుగులకు చంద్రబాబు చెప్పారు. దాంతో ఆ పార్టీకి చెందిన పలువురు ప్రస్తుత ఎంపీలు తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునే పనిలో బాబును ప్రసన్నం చేసుకునే పనిలో తలమునకలై ఉన్నారు.

అయితే, కొనకళ్ల నారాయణకు మాత్రం టికెట్ ఖాయంగానే కనిపిస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఆందోళన చేస్తూ కొనకళ్ల తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యారు. ఆ విషయం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దాంతో నారాయణకు ప్రజల సానుభూతి ఉందని బందరు నేతలతో పాటు చంద్రబాబు భావిస్తున్నారు. విభజనకు అనుకూలంగా రెండు సార్లు లేఖ ఇచ్చిన టీడీపీపై స్థానికంగా ఉన్న వ్యతిరేకత కొనకళ్లపై వచ్చిన సానుభూతితో కొట్టుకుపోతుందని కూడా అనుకుంటున్నారు. అందుకే నారాయణకు మళ్లీ టికెట్ ఇచ్చేందుకు బాబు సుముఖంగా ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News