: ఎంపీల మత్తు వదిలించేందుకే పోటీ చేస్తున్నా: రాఖీ సావంత్
ప్రజా సమస్యల్ని గాలికొదిలేసి నిద్రమత్తులో మునిగిపోయిన ఎంపీలను మేల్కొలిపేందుకే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని బాలీవుడ్ ఐటెం గర్ల్ రాఖీ సావంత్ చెబుతోంది. సామాన్యుల సమస్యలపై ప్రజా ప్రతినిధులు దృష్టి సారించేలా చేయాలని తాను భావిస్తున్నట్టు ఆమె చెప్పింది. ముంబై వాయవ్య నియోజకవర్గం నుంచి బరిలో దిగుతోన్న రాఖీ, శ్రీసాయినాథుని దర్శించుకునేందుకు ఇవాళ షిర్డీకి వచ్చింది.
సాయిబాబా దర్శనానంతరం రాఖీ మీడియాతో మాట్లాడింది. ఇంతకీ ఏ పార్టీ తరపున పోటీచేస్తున్నారని అడిగితే... 'వేచి చూడండి' అంటూ నవ్వుతూ చెప్పింది. అయితే, తాను లోక్ సభ ఎన్నికలకు సంబంధించి శనివారం నాడు నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ఆమె తెలిపింది. బాలీవుడ్ లో ఉన్నందుకు సంతోషంగా ఉందని, ప్రజాసమస్యల్ని పట్టించుకోవడం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని రాఖీ చెప్పింది.