: ఇంతకీ ఉగాది పండుగ ఆదివారమా? సోమవారమా?
ఉగాది పండుగ ఎప్పుడన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ నెల 30వ తేదీ, ఆదివారమా? లేక 31వ తేదీ సోమవారమా? అనే దానిపై ప్రజల్లో అయోమయం నెలకొంది. దీంట్లో కన్ ఫ్యూజన్ ఏముంది? మా క్యాలెండర్లో 31వ తేదీ, సోమవారం జయ నామ సంవత్సర తెలుగు సంవత్సరాది (ఉగాది పండుగ) అని ఉంది అంటారా? అదే మరి.... అక్కడే మన గవర్నర్ నరసింహన్ ‘పచ్చడి’లో కాలేశారు. ఆదివారం నాడు ఉగాది పండుగ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టు రాజ్ భవన్ కార్యాలయం నుంచి ఇప్పటికే ఆయన అందరికీ ఆహ్వానాలు పంపేశారు. అదే రోజున ఉగాది పంచాంగ శ్రవణాన్నీ నిర్వహిస్తున్నారు.
అయితే, తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం, భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 31నే ఉగాది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకు సోమవారం నాడు పండుగ సెలవు ప్రకటించింది. తెలుగు ప్రజలు కూడా 31వ తేదీ సోమవారం నాడు తెలుగు సంవత్సరాదిని చేసుకొనేందుకు సిద్ధమవుతున్నారు.