: కాంగ్రెస్ పార్టీతో పొత్తుల్లేవ్: హరీష్ రావు
కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తేల్చి చెప్పారు. పొత్తులంటూ కాంగ్రెస్ అధిష్ఠానం మైండ్ గేమ్ ఆడుతోందని... ప్రజలను తప్పుదోవ పట్టించడానికే కాంగ్రెస్ నేతలు పొత్తులంటూ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. పొత్తులకున్న దారులన్నీ మూసుకుపోయాయని ఆయన అన్నారు. మెదక్ లో ఈరోజు (శుక్రవారం) హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ... వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు.
స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై కోర్టు స్టే ఇవ్వడం దురదృష్టకరమని ఆయన అన్నారు. తెలంగాణలో సమస్యల పరిష్కారం టీఆర్ఎస్ తోనే సాధ్యమని హరీష్ రావు పునరుద్ఘాటించారు.