: నేడు విశాఖలో పవన్ కల్యాణ్ 'జనసేన' తొలి బహిరంగ సభ


'జనసేన' నిర్వహించ తలపెట్టిన తొలి బహిరంగ సభ విశాఖపట్నంలో ఈ రోజు జరగనుంది. సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఇటీవలే భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీని కలసి మద్దతు ప్రకటించిన ఆయన, అలా చేయాల్సి రావడానికి గల కారణాలను వివరించనున్నారు. మోడీ ప్రధాని అయితేనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పొచ్చని తెలుస్తోంది. టీడీపీతోనూ కలసి పనిచేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఆ పార్టీతో అనుసరించబోయే విధానాన్ని వెల్లడించే అవకాశం ఉంది. జనసేన పార్టీ ఏర్పాటు ప్రకటన సందర్భంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానో, లేదో చెప్పలేనన్న ఆయన, ఇప్పుడు పోటీ చేయనని సభలో ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

సాయంత్రం 4 గంటలకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ప్రారంభమవుతుంది. అనంతరం 6 గంటలకు పవన్ ప్రసంగం ప్రారంభమై రెండు గంటలపాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. జనసేన ఆవిర్భావ లక్ష్యాలను వివరిస్తూ ఆయన రాసిన 'ఇజం' పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించనున్నారు. పుస్తకం రచనకు తనకు తోడ్పాటునందించిన రాజు రవితేజను కూడా ఈ సభా వేదికపై పరిచయం చేస్తారని తెలుస్తోంది. యువతను దృష్టిలో పెట్టుకునే ఆయన ప్రసంగం ఉంటుందని భావిస్తున్నారు. ప్రధానంగా ఈ సభకు యువకులు, విద్యార్ధులు భారీ సంఖ్యలో హాజరయ్యేలా నిర్వాహకులు ప్రచారం చేపట్టారు.

  • Loading...

More Telugu News