: కేసీఆర్ ఉద్ధరించేది ఏమీ లేదు: రేణుకా చౌదరి
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని... ఆయనకు గుణపాఠం నేర్పేలా తెలంగాణలో 16 ఎంపీ సీట్లను కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఉద్ధరించేది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వాలని తాను గతంలోనే సూచించానని చెప్పారు. తాము గెలవలేమని తెలిసినా కొంతమంది నేతలు టికెట్లు కోరుతున్నారని... అలాంటి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. చంద్రబాబు, కేసీఆర్ లు కథలు చెబుతున్నారని... వారి కథలను సీరియళ్లుగా తీస్తే పార్టీలకు బోలెడంత ఫండ్ వస్తుందని ఎద్దేవా చేశారు. తాను రాజ్యసభ సభ్యురాలినైనా ఖమ్మం జిల్లాకే ఎక్కువ నిధులు కేటాయిస్తానని స్పష్టం చేశారు.