: నరేంద్ర మోడీ ప్రధాని కావడం కష్టమే: మొయిలీ
భారతీయ జనతాపార్టీలో నియంతగా మారిన నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే అవకాశాలే లేవని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ జోస్యం చెప్పారు. బెంగళూరులో ఈరోజు మెయిలీ మీడియాతో మాట్లాడారు. ‘‘మోడీ ప్రధాని కాలేరు, తన సొంత పార్టీలోనే ఆయన నియంతలా వ్యవహరిస్తున్నారు. గుజరాత్ లో బీజేపీకి చెందిన ప్రథమ, ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఇప్పటికే మోడీ తుడిచివేశారు. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ పని చేస్తున్నారు’’ అని మొయిలీ వ్యాఖ్యానించారు.
పార్లమెంటరీ వ్యవస్థ పైన కూడా మోడీకి ‘విశ్వాసం లేదు’ అని మొయిలీ ఆరోపించారు. అటల్ బిహారీ వాజ్ పేయి పాలనలో ఎన్డీయేలో 23 భాగస్వామ్య పక్షాలుండేవని, ఇప్పుడు ఆ సంఖ్య రెండుకు పడిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. దక్షిణాది, అసోంతో సహా ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో మోడీకి బలం లేదని ఆయన చెప్పారు. ఇక మోడీకి మద్దతు ఎక్కడ నుంచి వస్తుందని మొయిలీ ప్రశ్నించారు.