: జైల్లో ఆసుపత్రి నిర్మిస్తామంటున్న ఆరుషి తల్లిదండ్రులు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి, హేమరాజ్ జంట హత్యల కేసులో నిందితులైన వైద్య దంపతులు రాజేష్, నూపుర్ తల్వార్ లకు జీవితకాల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరూ ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో ఉన్న దస్నా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వృత్తి రీత్యా ఇద్దరూ వైద్యులు కావడంతో జైలు ప్రాంగణంలో ఓ డెంటల్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రతిపాదన చేస్తూ జైలు ఐజీ జగ్ మోహన్ యాదవ్ కు ఓ లేఖ రాసి తమ నిర్ణయాన్ని వెల్లడించారు.
తమ కుమార్తె ఆరుషి పేరుతో ఖైదీలకు ఆసుపత్రి పెట్టాలనుకుంటున్నామని, అందుకు మూడువందల చదరపు మీటర్ల స్థలంలో ఓ భవనాన్ని నిర్మించేందుకు అనుమతినివ్వాలంటూ వివరించారు. అంతేకాక డెంటల్ ఆసుపత్రి ఏర్పాటు ఖర్చు, మెడిసిన్ కొనడానికి, ఆసుపత్రికి అవసరమైన వైద్య సంబంధ పరికరాలు కొనుగోలుకు రూ.70 లక్షల ఖర్చు తామే భరిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇక ఖైదీలందరికీ ఉచితంగానే సేవ చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఒకవేళ తమకు బెయిల్ వచ్చినప్పటికీ జైల్లో తమ ఆసుపత్రిని కొనసాగిస్తామని వివరించారు.