: మీ జట్టును మా దేశం పంపరూ..!: పాక్ క్రికెట్ బోర్డు దీనాలాపన
పాకిస్తాన్ గడ్డపై ఓ విదేశీ క్రికెట్ జట్టు అడుగిడి ఏళ్ళు దాటుతున్నాయి. తీవ్రవాద దాడుల భయం ఓవైపు, మ్యాచ్ ఫిక్సర్ల బెడద మరోవైపు.. పర్యాటక జట్లకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. చివరిసారిగా అక్కడ టెస్టు మ్యాచ్ ఆడిన జట్టు శ్రీలంకే. 2009లో లంకేయులు పాక్ తో రెండు టెస్టులు ఆడారు. మరో మ్యాచ్ కోసం సిద్ధమవుతుండగా వారు ప్రయాణిస్తున్న బస్సుపై టెర్రరిస్టులు దాడి చేశారు.
ఈ ఘటనలో బస్సు డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో ఆటగాళ్ళు సురక్షితంగా బయటపడ్డారు. అప్పటినుంచి ఇప్పటివరకు మరో విదేశీ జట్టు పాక్ గడ్డపై మ్యాచ్ ఆడిందిలేదు. దీంతో, అబుదాబి, షార్జా వంటి తటస్థ వేదికలపై పాకిస్తాన్ హోం సిరీస్ లను నిర్వహించుకుంటోంది. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు జకా అష్రాఫ్.. దక్షిణాఫ్రికా జట్టును పాక్ పంపించమని సఫారీ క్రికెట్ బోర్డును అభ్యర్థిస్తున్నాడు.
ఇటీవలే పాక్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించిన నేపథ్యంలో, సఫారీలు కూడా పాక్ లో ఆడాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. వాస్తవానికి దక్షిణాప్రికా క్రికెట్ జట్టు అక్టోబర్-నవంబర్ నెలల్లో పాక్ లో పర్యటించాల్సి ఉంది. భద్రత కారణాల రీత్యా వారు వెనుకంజ వేస్తున్నారు. కాగా, కొద్దిరోజుల క్రితం అష్రాఫ్ జోహాన్నెస్ బర్గ్ ను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారులతో భేటీ అయ్యారు. తాము, ఎన్నో దేశాలకు ఉపకారం చేశామని, ఇప్సుడు సహాయం చేయాల్సిన వంతు ఆ దేశాలకొచ్చిందని పాక్ క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఒక్క పెద్ద జట్టు ఇక్కడికొచ్చిందంటే మిగతా జట్ల సందేహాలన్నీ పటాపంచలవుతాయని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి.