: టీ20 ప్రారంభంలోనే ఫైనల్ ను తలపించే మ్యాచ్


టీ20 ప్రపంచ కప్ సూపర్-10 ప్రారంభమే అదిరిపోయేలా ఉండనుంది. సూపర్-10 దశలో తొలి పోరే అంతిమ సమరాన్ని తలపించనుంది. చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్థాన్ మధ్య తొలి మ్యాచ్ నేటి సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. అంతర్జాతీయ క్రికెట్లో దాయాదుల పోరు ఎల్లప్పుడూ ఉత్కంఠ రేపుతుంది. తాజాగా భారత, పాక్ జట్లు ఒక సిరీస్ లో ఒకరు పైచేయి సాధిస్తే, మరో సిరీస్ లో మరోకరు పైచేయి సాధిస్తున్నారు.

ఆటగాళ్లు సంయమనం పాటిస్తున్నారు, దూషించుకోవడాలు, తోసుకోవడాలు, గుడ్లురుమి చూసుకోవడాలు, విమర్శలు ప్రతివిమర్శలకు దిగడం వంటివి మానేసి పరిణతి చూపిస్తున్నారు. దీంతో గతంలో ఉన్నంత తారస్థాయి ఉత్కంఠ లేనప్పటికీ, పాక్, భారత్ మధ్య పోరాటం అంటే ఎప్పుడూ ఉత్తంఠ రేపేదే. అదీ కాక రెండు జట్లు ఉపఖండానికి సంబధించినవి, మరో వైపు ఉపఖండంలోని బంగ్లాదేశ్ లో మ్యాచ్ లు జరగడంతో ఈ రెండు జట్లనే టైటిల్ ఫేవరేట్లుగా క్రీడా పండితులు అంచనావేస్తున్నారు.

దీంతో ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు అర్హత సాధించినట్టే భావిస్తున్నారు. దీంతో ఆటగాళ్లు శక్తి మేర రాణించి ప్రత్యర్థిపై తమదే పైచేయి అని చాటి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. బ్యాటింగ్ లో రెండు జట్లు పటిష్ఠంగా ఉండగా, బౌలింగ్ లో పాకిస్థాన్ దే పైచేయి. పిచ్ స్వభావం బట్టి మ్యాచ్ స్వరూప స్వభావాలు స్పిన్నర్ల రాణింపుపైనే ఆధారపడి ఉంది.

అజ్మల్, అఫ్రిది లాంటి అత్యుత్తమ స్పిన్నర్లు పాక్ కు అందుబాటులో ఉండగా, ఫర్వాలేదనిపించేలా ఫామ్ కోల్పోయిన అశ్విన్, జడేజా, యువీ, రోహిత్, మిశ్రాలు అందుబాటులో ఉన్నారు. వీరిలో తుదిజట్టులో ఎవరికి ధోనీ స్థానం కల్పిస్తాడో చూడాలి. అంతిమ సమరం కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ లో బెట్టింగ్ భారీ స్థాయిలో జరుగనుందని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి.

  • Loading...

More Telugu News