: పోయాడనుకున్న భర్త మళ్లీ వచ్చాడు ... ఇరకాటంలో ఆమె!
ఎప్పుడో 11 ఏళ్ళ క్రితం పాముకాటుతో చనిపోయాడని భావించిన ఓ వ్యక్తి తిరిగొచ్చి తన కుటుంబ సభ్యులను ఇరకాటంలోకి నెట్టాడు. వివరాల్లోకెళితే... పదకొండేళ్ళ క్రితం ఉత్తరప్రదేశ్ లోని బరేలీ ప్రాంతంలోని భడ్వా గ్రామంలో ఛత్రపాల్ (25) అనే వ్యక్తిని పాము కరిచింది. అచేతనంగా పడిపోయిన ఛత్రపాల్ ను చనిపోయాడని భావించి అతని కుటుంబ సభ్యులు ఆచారం ప్రకారం ఓ నదిలోకి విసిరేశారు.
అప్పటికే ఛత్రపాల్ భార్య ఊర్మిళ గర్భవతి. భర్త మరణం అనంతరం ఆమెకు గర్భం పోయింది. ఆ తర్వాత ఊర్మిళకు ఛత్రపాల్ తమ్ముడితో పెళ్ళయింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. వారి సంసారం అలా జరిగి పోతుండగా, సోమవారం నాడు ఛత్రపాల్ హఠాత్తుగా ఊడిపడ్డాడు. అతడిని చూసి అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. చనిపోయినవాడు ఎలా బతికొచ్చాడా? అని! విషయం ఆరా తీయగా.... అప్పుడు చెప్పాడు అసలు కథ.
చనిపోయాడనుకుని కుటుంబ సభ్యలు పారేశారని, అయితే తాను కేవలం స్పృహ కోల్పోయానని తెలిపాడు. కొందరు పాముల వాళ్ళు తనను నీటిలోంచి వెలికి తీసి వారి వైద్యంతో తనను ప్రాణగండం నుంచి గట్టెక్కించారని చెప్పాడు ఛత్రపాల్. ఇక, చిక్కంతా ఇప్పుడే మొదలైంది.
భార్య తమ్ముడితో కాపురం చేస్తుండడంతో ఛత్రపాల్ డైలమాలో పడ్డాడు. ఊర్మిళ మాత్రం ఇద్దరినీ భర్తలుగా అంగీకరించేందుకు సిద్ధమని తెలిపింది. ఏదేమైనా, కుటుంబమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఛత్రపాల్ సోదరుడితోనే ఉంటోంది.