: నాసా చెప్పినా పట్టించుకోని అధికారులు
గోటితో పోయేదానిని గొడ్డలి వరకు తెచ్చారు మన అటవీ శాఖ అధికారులు. శేషాచలం కొండల్లో మంటలు చాలా రోజుల ముందే చెలరేగినా, సాక్షాత్తూ నాసా హెచ్చరించినా అటవీశాఖాధికారులు పట్టించుకోలేదు. దీంతో ఐదు వేల హెక్టార్ల అటవీ సంపద అగ్నికి ఆహుతైంది. తిరుమల అభయారణ్యం అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు.
ఈ నెల రెండో తారీఖున నాసా అగ్నికీలలను గుర్తించి సమాచారం అందించింది. అప్రమత్తమవ్వాలని ప్రభుత్వాధికారులను హెచ్చరించింది. అయితే ఎవరో హెచ్చరిస్తే మేమెందుకు పట్టించుకోవాలనుకున్నారో ఏమో కానీ, అది దావానలంలా వ్యాపించి, అడవిని, అటవీ సంపదను, వన్యప్రాణులను బలితీసుకున్న తరువాత మేల్కొన్నారు. తిరుమల సన్నిధికి కూడా అది వస్తుందేమో అన్న భయంతో తలలుపట్టుకున్నారు. పవన విద్యుత్ కేంద్రాన్ని బలి తీసుకున్నాక మంటల తీవ్రతకు బెంబేలెత్తిపోయారు. చివరకు మంటలను ఆర్పడానికి హెలికాప్టర్లను రంగంలోకి దించారు. ఇదీ మన అధికారుల తీరు!.