: వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా సీమాంధ్ర అధ్యక్ష పదవి: బాలయ్య కోరిక
టీడీపీ అధినేత చంద్రబాబుకు బావమరిది బాలయ్య రూపంలో సరికొత్త సమస్య వచ్చిపడింది. ఏనాడు తన బావముందు ఎలాంటి డిమాండ్లు పెట్టని బాలయ్య... ఈసారి మాత్రం ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. తనకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా సీమాంధ్ర టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వాలని మనసులోని మాట బయటపెట్టారు. అయితే చంద్రబాబు ఇప్పటి వరకు ఈ డిమాండ్లపై స్పందించలేదని తెలుస్తోంది. ఈమధ్య కాలంలో బాలయ్య అభిమానులు కూడా తమ అభిమాన కథానాయకుడికి పార్టీ పదవి ఇవ్వాల్సిందే అంటూ నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, బాలయ్య కోరుకున్న చోట ఆయనకు టికెట్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే, పదవి సంగతి తేలిన తర్వాతే సీటు సంగతి చూసుకుందామని బాలయ్య కూడా పట్టుదలగా ఉన్నట్టు సమాచారం.
దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కూడా బహిరంగంగా మాట్లాడకపోయినా... అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారు. బాలయ్యకు పదవి ఇస్తే టీడీపీ ఒక కుటుంబ పార్టీ (బావ అధ్యక్షుడు, బావమరిది వర్కింగ్ ప్రెసిడెంట్) అనే అపవాదును కొని తెచ్చుకున్నట్టు అవుతుందని వీరు భావిస్తున్నారు. అంతేకాకుండా, బాలయ్యకు అంత కోరిక ఉంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసి గెలవాలి కాని... ఇలా పదవులు కోరడం సరికాదని ఓ పొలిట్ బ్యూరో సభ్యుడు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఏమి జరగబోతోందన్న సంగతి తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.