: తిరుమల కొండల్లో అగ్నిప్రమాదాలు మానవ తప్పిదమే
టీటీడీ పరిధిలోని ఏడు కొండల్లో అగ్నిప్రమాదాలు జరగటానికి 90 శాతం మానవ తప్పిదాలే కారణమని అటవీ శాఖ కన్సర్వేటర్ రవికుమార్ అన్నారు. అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరిగితే అదుపు చేయడం కష్టమని ఆయన అన్నారు. ప్రమాదాలు జరగకుండా నివారణ ఒక్కటే దీనికి మార్గమని ఆయన తెలిపారు. విదేశాల్లోలాగా ఇక్కడ హెలికాప్టర్ ద్వారా మంటలను అదుపు చేసే విధానం అందుబాటులో లేదని రవికుమార్ చెప్పారు.
శేషాచలం కొండల్లో కార్చిచ్చు పాపవినాశనం వైపుకు వేగంగా వ్యాపిస్తోంది. మరోవైపు పవన విద్యుత్ కేంద్రంలోని నాలుగు జనరేటర్లు అగ్నికి తగలబడ్డాయి. మంటలను ఆర్పేందుకు అటవీ శాఖాధికారులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినా మంటలు అదుపులోకి రావటం లేదు. ఇప్పటికే వేలాది ఎకరాల అటవీ భూమి అగ్నికి ఆహుతి అయింది.