: 16 ఎంపీ కావాలి.. లేదు, 6 ఇస్తాం: టీడీపీ, బీజేపీల మధ్య బేరసారాలు షురూ
రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు కలసి పోటీ చేయడం ఖాయమైపోయింది. ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయంలో ప్రాథమిక చర్చలు కూడా షురూ అయ్యాయి. మొత్తం మీద (సీమాంధ్ర, తెలంగాణల్లో) 16 ఎంపీ, 75 ఎమ్మెల్యే సీట్లు కావాలని కమలనాథులు డిమాండ్ చేస్తున్నారు. వీటిలో సీమాంధ్రలో 25, తెలంగాణలో 50 ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నారు. అలాగే సీమాంధ్రలో 8, తెలంగాణలో 8 ఎంపీ సీట్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, అన్ని సీట్లు కేటాయించలేమని మొత్తంగా 6 ఎంపీ, 24 అసెంబ్లీ సీట్లను కేటాయిస్తామని టీడీపీ స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నెలాఖరుకు చర్చలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి హైదరాబాదు వచ్చిన జవదేకర్ ఇక్కడే రెండు రోజులపాటు మకాం వేసి సీట్ల సర్దుబాటు వ్యవహారంపై టీడీపీతో చర్చలు జరిపారు. మరోవైపు, బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అరుణ్ జైట్లీ టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్ లో ఉన్నారు.
గతంలో 2009 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ తమతో పొత్తు పెట్టుకున్నప్పుడు... ఒత్తిడి తెచ్చి 8 ఎంపీ, 45 అసెంబ్లీ సీట్లు తీసుకుందని... కానీ, కేవలం 2 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలిచిందని టీడీపీ చెబుతోంది. అప్పట్లో టీఆర్ఎస్ ఏకంగా 35 అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోవడంతో... టీడీపీ అధికారానికి దూరమైంది. ఈ నేపథ్యంలో కేవలం 6 ఎంపీ, 24 అసెంబ్లీ సీట్లను మాత్రమే ఇవ్వగలమని బీజేపీకి టీడీపీ చెబుతోంది. ఏదైమైనప్పటికీ కొన్ని సీట్లు అటూఇటుగా ఈ నెలాఖరులోగా సీట్ల సర్దుబాటు పూర్తవనుంది.