: లంకతో ఢీ నేడే


టీ20 ప్రపంచకప్ తొలి వార్మప్ మ్యాచ్ లో శ్రీలంకతో భారత జట్టు నేడు తలపడనుంది. గత కొంతకాలంగా పరాజయాల బాటపట్టి, ప్రతిష్ఠ మసకబారిన టీమిండియా రిజర్వ్ బెంచ్ పరీక్షించేందుకు ఇదే చక్కని అవకాశమని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. టీ20 ప్రపంచకప్ సూపర్ 10 దశలో నేరుగా బరిలోకి దిగనున్న టీమిండియా అంతకు ముందు రెండు వార్మప్ మ్యాచ్ లు ఆడనుంది.

ఈ వార్మప్ మ్యాచ్ ద్వారా తుదిజట్టును నిర్ధారించనుండడం విశేషం. యువరాజ్ సింగ్, సురేష్ రైనాల చేరికతో భారత జట్టు బలంగా తయారైంది. అయితే తుది జట్టుకి ఎవరిని ఖరారు చేయాలా? అనేది కెప్టెన్ ధోనీకి పాలుపోవడం లేదు. దీంతో వార్మప్ మ్యాచ్ లో ఎవరు రాణిస్తే వారినే జట్టులో స్థానం వరించే అవకాశం కనబడుతోంది. సీనియర్లైన యువీ, రైనాలు జట్టులోకి వస్తే ధావన్, రోహిత్, రహానేలలో ఇద్దరు తొలగిపోవాల్సి ఉంటుంది. వారెవరనే విషయంలో ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.

ధావన్, రోహిత్ విదేశాల్లో విఫలమైనప్పటికీ, వారికి ఉపఖండంలో ఘనమైన రికార్డు ఉంది. రహానే గత రెండు సిరీసుల్లో అర్ధసెంచరీలతో చెలరేగి మంచి ఫాంలో ఉన్నాడు. మరోవైపు ముగ్గురు పేస్ బౌలర్లతో బరిలో దిగాలా? లేక ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగాలా? అనేది కూడా ధోనీ తేల్చుకోలేకపోతున్నాడు. జడేజా, అశ్విన్, మిశ్రా, స్టువర్ట్ బిన్ని, షమి, ఆరోన్, భువనేశ్వర్, మోహిత్ శర్మ అందుబాటులో ఉండగా, యువీ కూడా బంతితో అద్భుతాలు చేయగలడు.

దీంతో ఎవర్ని తుది జట్టులోకి తీసుకోవాలో ధోనీకి పాలుపోవడం లేదు. ఏది ఏమైనా రెండు వార్మప్ మ్యాచ్ లు ఉండడంతో 15 మందిని ప్రయోగించాలని ధోనీ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా నేటి సాయంత్రం 7 గంటలకు శ్రీలంకతో తలపడనుంది.

  • Loading...

More Telugu News