: బెల్టు షాపులు చంద్రబాబు చలవే: విజయమ్మ
అనంతపురం జిల్లా మడకశిర రోడ్ షోలో చంద్రబాబుపై వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలన అంతా చీకటి యుగంలా గడిచిందని విమర్శించారు. బెల్టు షాపులు గ్రామాల్లోకి వెళ్లాయంటే అది చంద్రబాబు చలవేనని అన్నారు. ఆందోళనలు చేస్తున్న వారిని గుర్రాలతో తొక్కించింది, కాంట్రాక్టు ఉద్యోగాలు తెచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. రాజశేఖరరెడ్డి అభివృద్ధి, సంక్షేమాలనే రెండు కళ్లుగా భావించారని తెలిపారు. అప్పట్లో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు... ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తానని అంటున్నారని విమర్శించారు. జగన్ బాబును గెలిపించుకుని... వైఎస్ ఆశయాలు సాధించుకుందామని పిలుపునిచ్చారు.