: మలేషియా విమానం కొంపదీసి పాక్ లోని స్వాత్ లోయకు వచ్చిందా?
మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానం తప్పిపోయిన ఘటనపై విమానం ఆచూకీ కోసం నిపుణులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. అయినప్పటికీ విమానం ఆచూకీ లభ్యం కావడంలేదు. సాంకేతికంగా ఇంత పురోగతి సాధించినా విమానాన్ని కనుగోలేకపోవడం పెను తప్పిదంగా భావిస్తున్నారు. కాగా విమానం అదృశ్యంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. తాజాగా మరో అనుమానం అందర్లోనూ కలుగుతోంది. విమానం కొంపదీసి పాకిస్థాన్ లోని స్వాత్ లోయకు వచ్చిందా? అనే అనుమానం రేకెత్తుతోంది.
పాకిస్థాన్ లో తీవ్రవాదం బలంగా ఉండడం, స్వాత్ లోయ సురక్షితంగా ఉంటుందని భావించడం, విమానంలోని ఇంధనం స్వాత్ లోయ వరకు ప్రయాణించేంత వరకు సరిపోతుందనే నేపథ్యంలో... ఈ కోణంలో ఆలోచిస్తున్నారు. అమెరికాలోని ట్విన్ టవర్స్ కూల్చిన తరువాత నిపుణులైన పైలట్లు ఉగ్రవాదులకు అందుబాటులో ఉండే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేమని అంటున్నారు. దీంతో విమానం పాక్ లో కనిపించినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. అయితే పాక్ లోని స్వాత్ లోయకు వచ్చే అవకాశాలు లేవని, ఈ వార్తలు ఊహాజనితమని మలేషియా ఎయిర్ లైన్స్ అధికారులు చెబుతున్నారు.