: హైజాక్ విషయం ఇంకా నిర్ధారణ కాలేదు: మలేసియా ప్రధాని
గత శనివారం నుంచి కనిపించకుండా పోయిన మలేసియన్ ఎయిర్ లైన్స్ జెట్ విమానం హైజాక్ కు గురైనట్టు ఇంకా నిర్ధారణ కాలేదని మలేసియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ తెలిపారు. విమాన కమ్యూనికేషన్ వ్యవస్థను ఎవరో ఉద్దేశపూర్వకంగా నిలిపివేసినట్టు దర్యాప్తు అధికారులు భావించారని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా రెండు మార్గాల్లో ఈ విమానం పయనించి ఉండొచ్చన్న సమాచారంతో గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నామని చెప్పారు.
ఉత్తర థాయ్ లాండ్ నుంచి కజకిస్తాన్, తుర్క్ మెనిస్తాన్ సరిహద్దుల వైపు గానీ, ఇండోనేషియా నుంచి హిందూ మహాసముద్రం దిశగా గానీ విమానం పయనించి ఉండొచ్చన్న సమాచారం ఉందని నజీబ్ పేర్కొన్నారు. తాజా సమాచారం నేపథ్యంలో విమానం ఆచూకీ తప్పక లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.