: బొత్సకు రాజకీయ గురువు సెగ


పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణకు ఒకప్పటి రాజకీయ గురువు సెగపెడుతున్నారు. రాజకీయాల్లో ఓనమాలు నేర్పి... బొత్సను నేతగా తీర్చిదిద్దారని పేరున్న పెన్మత్స సాంబశివరాజు విజయనగరం జిల్లాలో మరోసారి రాజకీయ చతురుత చూపిస్తున్నారు. తనను చిన్న చూపు చూసి కాంగ్రెస్ పార్టీలో స్థానం లేకుండా చేసిన బొత్సపై అంతకంతా తీర్చుకునే పథకాలు రచిస్తున్నారని సమాచారం.

విజయనగరం జిల్లాలో అంతా తానై నడిచి, తిరుగులేదనుకున్న బొత్స కుటుంబానికి సవాలు విసురుతున్నారు. విజయనగరం జిల్లాలో బొత్స అనుచరులు ఒక్కొక్కర్నే అతని నుంచి దూరం చేస్తున్నారు. మొన్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే మీసాల నీలకంఠనాయుడు వైఎస్సార్సీపీలో చేరితే, తాజాగా బెల్లాన చంద్రశేఖర్ కూడా అదే పార్టీలో చేరారు. వీరిద్దరూ బొత్సకు ప్రధాన అనుచరులని జిల్లాలో చెప్పుకుంటారు.

దీంతో పార్టీ కేడర్ కూడా పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీని వీడే సూచనలు కనిపిస్తున్నాయి. వీరి చేరిక వెనుక పెన్మత్సే ఉన్నారనేది జగమెరిగిన సత్యం. దీంతో ఈసారి విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి, బొత్స కుటుంబానికి పెన్మత్స ఝలక్ ఇస్తున్నారని జిల్లా రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. గతంలో నెల్లిమర్ల అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన పెన్మత్సను బొత్స అవమానించారని జిల్లాలో కాంగ్రెస్ నేతలు చెబుతుంటారు. దీంతో ఆయన రాజకీయ అస్త్రసన్యాసం చేశారు.

రాజశేఖరరెడ్డి మరణం తరువాత వైఎస్సార్సీపీలో చేరి జిల్లా కన్వీనర్ గా ఉన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన తన వ్యూహాలకు పదునుపెట్టి జిల్లా నుంచి కాంగ్రెస్, బొత్స ఆధిపత్యాన్ని తుడిచిపెట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకనుగుణంగా బొత్స అనుచరులు రోజుకొకరు పార్టీ వీడుతున్నారు.

  • Loading...

More Telugu News