: స్వతంత్ర భారతంలో అన్ని ఎన్నికల్లోనూ ఓటేస్తూ వస్తోన్న పెద్దాయన


ఆయన స్వతంత్ర భారతదేశంలో జరిగిన తొలి ఎన్నికల సంగ్రామానికి సజీవ సాక్షి. నాటి నుంచి నేటి దాకా, పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి లోక్ సభ ఎన్నికల వరకు... అన్ని ఎన్నికల్లోనూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న ప్రజాస్వామ్య వాది. ఇప్పుడు ఆయన వయసు 97 సంవత్సరాలు. శ్యామ్ చరణ్ నేగి పేరుతో ఎలక్షన్ కమిషన్ కు కూడా సుపరిచితుడైన ఈ తాత హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లా కల్ప అనే గ్రామంలో ఉంటున్నారు. మండి లోక్ సభ స్థానం కిందకు ఇది వస్తుంది.

స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర్నుంచి అన్ని ఎన్నికల్లోనూ నేగి తాతయ్యలా ఓటేసిన వారు చాలా చాలా అరుదు. అందుకే ప్రస్తుత ఎన్నికల ముందు మళ్లీ ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నేగి తాత 1951 అక్టోబర్ లో జరిగిన తొలి లోక్ సభ ఎన్నికల పోలింగ్ లో చీనీ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. చీనీ స్థానమే ప్రస్తుతం కిన్నౌర్ గా మారింది. తొలిసారిగా జవహర్ లాల్ నెహ్రూకు ఓటేశానని నేగి చెబుతారు.

వయసు ప్రభావంతో ప్రస్తుతం నేగి తాతకు చూపు, వినికిడి శక్తి తగ్గిపోయాయి. అయినా ఇప్పటికీ ఎవరి సాయం లేకుండానే నడుస్తారు. ఈవీఎంలో ఎలా ఓటేయాలో తనకు తెలుసని ఆయన స్పష్టంగా చెబుతారు. ఓటు హక్కు విలువ తెలిసిన నేగి తాతగారు ప్రస్తుత నేతలు అవినీతిలో కూరుకుపోవడం, పార్లమెంటులో విలువైన సమయాన్ని హరించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు ప్రాతినిధ్యాన్ని, నోటా ఆప్షన్ ను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. మే 7న జరగనున్న లోక్ సభ పోలింగ్ కోసం నేగి ఎదురు చూస్తున్నారు. ఈయన గొప్పతనాన్ని గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ 2010లో స్వయంగా కల్ప గ్రామానికి వెళ్లి ఈసీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News