: కేసీఆర్ విలీనం చేయననడం ఆశ్చర్యమే: దిగ్విజయ్
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు చెప్పిన తరువాతే విభజనపై నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం అంత సులువైన విషయమేమీ కాదని, కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
ఎన్నో ఏళ్లుగా రాష్ట్రం కోసం ఉద్యమించిన తెలంగాణ వారికి న్యాయం చేశామని ఆయన చెప్పారు. సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించామన్నారు. ప్రత్యేక హోదాతో ఆ ప్రాంతానికి పెట్టుబడులు వస్తాయని ఆయన అన్నారు. విభజన అనంతరం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. అయితే విభజన జరిగిన తర్వాత విలీనం చేయబోనని కేసీఆర్ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించిందని దిగ్విజయ్ అన్నారు.
తాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ రాష్ట్రం నుంచి ఛత్తీస్ గడ్ ను విభజించారని, అక్కడ ఛత్తీస్ గడ్ ప్రాంతం అభివృద్ధి చెందిన విషయాన్ని ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ గుర్తు చేశారు. అక్కడ ఇరు రాష్ట్రాలకూ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని ఆయన చెప్పారు.