: పవన్ కల్యాణ్ 'జనసేన'కు హక్కు లేదా?
సినీ నటుడు పవన్ కల్యాణ్ పార్టీ 'జనసేన' రిజస్ట్రేషన్ లేకుండా ప్రకటించకూడదా? పబ్లిక్ మీటింగుల్లో పార్టీ పేరు వాడకూడదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ హెచ్ ఎస్ బ్రహ్మ స్పందించారు. 'జనసేన' పేరిట మార్చి 10న ఒక దరఖాస్తు వచ్చిందని, అందులో పవన్ కల్యాణ్ ను అధ్యక్షుడిగా పేర్కొన్నారని ఆయన తెలిపారు. తాము జనసేన పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నామని అందులో పేర్కొన్నారని అన్నారు.
అయితే ఎన్నికల సమయం దగ్గరపడడంతో అది సాధ్యపడేలా కనిపించడం లేదన్నారు. నిబంధనల ప్రకారం పార్టీ రిజస్ట్రేషన్ ఆరు నెలల ముందు జరగాలి. పబ్లిక్ హియరింగ్ జరగాలి, అనుమతి రావాలి. పార్టీ పేరిట ఎన్నికల్లోకి వెళ్లాలంటే రిజస్ట్రేషన్ అవసరం అని ఆయన స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఎన్నికల్లోకి వెళ్లాలంటే స్వతంత్ర అభ్యర్థులుగా వెళ్లాలని, పార్టీ పేరు వాడితే ఇతర పార్టీలు అభ్యంతరం చెబుతాయన్నారు. రిజస్ట్రేషన్ లేకుండా పార్టీ పేరు ప్రకటించకూడదని, పబ్లిక్ గా వాడకూడదని ఆయన తెలిపారు.