: పవన్ కల్యాణ్ 'జనసేన' ఆవిర్భావ సభలో జరుగనున్న విశేషాలు
సినీ నటుడు పవన్ కల్యాణ్ ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీ 'జనసేన' ఆవిర్భావ సభ నేడు హైదరాబాదు, మాదాపూర్ లోని నోవాటెల్ హోటల్ లో జరుగనుంది. ఈ వేదికపై పవన్ కల్యాణ్ ఒక్కరే వుంటారు. సభ నిర్వహణ, పార్టీ పేరు, జెండా రూపురేఖలు, పార్టీ ధీమ్ సాంగ్, పార్టీ ప్రకటన వేదిక వంటివన్నీ చివరి వరకు గోప్యంగా ఉంచారు. నేటితో ఆ ఉత్కంఠకు తెరదించనున్నారు.
తొలుత రాజకీయాలపై ఆయన రాసిన అభిప్రాయాల పుస్తకాన్ని విడుదల చేసి, ఆయన భావాలను స్వేచ్ఛగా అభిమానులు, ప్రజలతో పంచుకోనున్నారు. ఈ సభలో ఆయన ఒక్కరే గంటసేపు మాట్లాడనున్నారని సమాచారం. తన వ్యక్తిగత జీవిత విశేషాలు, తన స్వానుభవాలు, రాజకీయ అరంగేట్రానికి దారితీసిన పరిస్థితులు అన్నింటినీ ఆయనే స్వయంగా వెల్లడించనున్నారు. సభ రాత్రి 10 గంటలకల్లా ముగిసే అవకాశం ఉంది.