: సచిన్ రిటైర్మెంటుపై చర్చ సరికాదు: బీసీసీఐ చీఫ్
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రిటైర్మెంటు అంశంపై చర్చించడం సరికాదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ అంటున్నారు. సచిన్ క్రికెట్ కు వీడ్కోలు పలకాల్సిన తరుణమిదేనన్న వాదనలను శ్రీనివాసన్ కొట్టిపారేశారు. భారత్ కు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లలో సచినే మేటి అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
ఈ మధ్య కాలంలో సచిన్ భారీ స్కోర్లు సాధించడంలో విఫలం కావడం, అనామక బౌలర్లకు సైతం అతి తేలిగ్గా వికెట్ అప్పగిస్తున్న నేపథ్యంలో ఈ బ్యాటింగ్ లెజెండ్ తప్పుకుంటేనే మంచిదన్న విమర్శలు ఎక్కువయ్యాయి. కాగా, సెహ్వాగ్, గంభీర్ లను పక్కనబెట్టిన బోర్డు సచిన్ విషయంలో ప్రత్యేకంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలపై శ్రీనివాసన్ స్పందించారు. 'సచిన్ లాంటి మహోన్నత ఆటగాడి ప్రదర్శనను సిరీస్ ల వారీగా పరిశీలించడం తెలివైన పనికాదు' అని చెప్పారు.
ఇక తన వ్యక్తిగత అభిప్రాయం అంటూ, మిగతావాళ్ళతో సచిన్ ను పోల్చలేమన్నారు. అయినా, సచిన్ ను జట్టులోకి ఎంపిక చేసే విషయం తనను అడగొద్దని, తానేమీ సెలెక్టర్ ను కాదని పేర్కొన్నారు.