: టీమిండియా కెప్టెన్, కోచ్ మీడియా ముందుకు వస్తారా...?
సొంతగడ్డపై పులి, విదేశాల్లో పిల్లి! టీమిండియాకు చక్కగా నప్పే ఉపమానం ఇది. ఇటీవలి కాలంలో భారత క్రికెట్ జట్టు పరాజయ పరంపర పతాకస్థాయికి చేరింది. ఇంటాబయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు మీడియా తాకిడి, మరోవైపు భారత మాజీ క్రికెటర్ల మాటల దాడి టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, కోచ్ డంకన్ ఫ్లెచర్ లకు తలనొప్పిగా మారాయి. మీడియా ముందుకు రావాలంటేనే వారిద్దరూ జంకే పరిస్థితి నెలకొంది.
టి20 వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు ఎల్లుండి భారత జట్టు బంగ్లాదేశ్ పయనం కానుంది. ఆనవాయతీ ప్రకారం మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉన్నా వీరిద్దరూ విముఖత ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో బీసీసీఐ కూడా ఎందుకొచ్చిన తలనొప్పి అన్నట్టు మీడియా సమావేశాన్ని రద్దు చేసింది. ఓటములపై వివరణ ఇవ్వకుండా ఫ్లెచర్, ఫిక్సింగ్ లో పాత్రపై ప్రశ్నల పరంపర నుంచి తప్పించుకునేందుకు ధోనీ మీడియాను దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది.