: రైలు ప్రయాణానికి విమాన ఛార్జీలు !
సంక్రాంతి, దసరా లాంటి పండుగలొస్తే ప్రజల కంటే ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలే ఎక్కువగా సంబరపడిపోతుంటాయి. కారణమేమిటంటే, ప్రయాణికుల రద్దీతో వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రైవేట్ సహా ఆర్టీసీ యాజమాన్యాలు టిక్కెట్ ఛార్జీలు భారీగా పెంచి సొమ్ము చేసుకుంటాయి. ప్రత్యేక బస్సుల్లో అయితే సాధారణం కంటే 50 శాతం ఎక్కువ ఛార్జీని వసూలు చేస్తారు. ఇప్పుడు రైల్వే శాఖ కూడా వీళ్లందరి కంటే తామేం తక్కువ కాదంటోంది. ప్రత్యేక రైలుకు పెంచిన చార్జీలను చూస్తే ప్రయాణికుల కళ్లు బైర్లు కమ్మక మానవు.
వసంతోత్సవ పండుగ (హోలీ) సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-జమ్మూ సెక్టార్ల మధ్య రెండు సూపర్ ఫాస్ట్ ప్రీమియమ్ ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. టిక్కెట్ ధరలను మాత్రం పది, ఇరవై కాదు... ఏకంగా 250 నుంచి 300 శాతం వరకు పెంచేసింది. ముందుగా బుక్ చేసుకున్న వారికి రూ. 2500 టూ టైర్ ఏసీ టిక్కెట్ ధరను, చివరి నిమిషంలో బుక్ చేసుకుంటే మాత్రం రూ. 7000 లేదా మరింత ఎక్కువ కూడా పెరగొచ్చు. వీటితో పోలిస్తే విమాన ఛార్జీలే తక్కువ. ప్రత్యేక రైళ్లను నడపడం ద్వారా రైల్వే శాఖకు భారీ ఆదాయం వస్తోంది. డిమాండును అనుసరించి టిక్కెట్ల ధరను పెంచుతుంటామని రైల్వే సీనియర్ అధికారి వెల్లడించారు.
సాధారణంగా ఢిల్లీ నుంచి ముంబై, జమ్మూలకు తగిన సంఖ్యలో రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే హోలీ పండుగకు సొంత ఊరికి వెళ్లే ప్రయాణికులు భారీ సంఖ్యలో ఉండటంతో ఇవి సరిపోవడం లేదు. విమానాలకు కూడా రద్దీ ఎక్కువగానే ఉంటోంది. రైల్వే శాఖకు ఇది కలిసొచ్చింది. ఈ ప్రత్యేక రైళ్లు ఢిల్లీ నుంచి ఈ నెల 14, 16వ తేదీల్లో ముంబైకి, 14, 16, 21 తేదీల్లో జమ్మూకు బయల్దేరుతాయి.