: బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమైన మెగా ఎయిర్ షో
బేగంపేట విమానాశ్రయంలో మెగా ఎయిర్ షో కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ‘‘ఇండియా ఏవియేషన్ 2014’’ పేరుతో నిర్వహిస్తున్న ఈ విహంగ ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అజిత్ సింగ్, సహాయ మంత్రి వేణుగోపాల్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
ఈ విమాన సదస్సులో ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకోయిస్ రిచెర్, అమెరికా ట్రేడ్ అండ్ డెవలప్ మెంట్ ఏజెన్సీ డెరెక్టర్ లియోకాడియో జాక్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బోయింగ్ డ్రీమ్ లైనర్, ఎయిర్ బస్ ఎ-380 ఈ ప్రదర్శనకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ షోలో 18 దేశాలకు చెందిన 250 సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. ఈ షోలో విమానాలు, హెలికాప్టర్లు, ఇంజన్లు, విమానాల విడిభాగాలను చూడవచ్చు.
ఈ ప్రదర్శనలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ (ఎ.ఎల్.హెచ్), మల్టీరోల్ ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎం.టి.ఎ), డోర్నియర్, లైట్ యుటిలిటీ హెలికాప్టర్ (ఎల్.యు.హెచ్)లను ప్రదర్శించనున్నట్టు హెచ్ఏఎల్ ఛైర్మన్ డాక్టర్ ఆర్.కె.త్యాగి తెలిపారు.