: ఈ దేవుడికి చాక్లెట్లే నైవేద్యం
హిందూ సంప్రదాయం ప్రకారం భగవంతుడికి నైవేద్యం అంటే ఫలమో, పత్రమో సమర్పించుకోవడం అన్నది తెలిసిందే. కానీ, కేరళలోని 'తెక్కణ్ పళని' బాలసుబ్రమణియం స్వామికి మాత్రం చాక్లెట్లే నైవేద్యం. అదీ కూడా దేశంలో అగ్రగామి బ్రాండ్ చాక్లెట్లనే సమర్పించుకుంటారట ఇక్కడ. అళప్పుజ జిల్లాలోని ఈ పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న స్వామివారికి మరో పేరు కూడా ఉంది. స్థానికంగా 'మంచ్ మురుగన్' దేవాలయం అంటే ఎవరైనా చెప్పేస్తారు. పరీక్షల సమయంలో అయితే ఇక్కడ విద్యార్థులు ఎగబడతారట. చిన్నారులు తమ పరీక్షల ఉత్తీర్ణత భారాన్ని ఈ ' బాల మురుగన్' పైనే వేస్తారు మరి.
ఆ గుడిలో అర్చన, పుష్పాంజలి అనంతరం ప్రసాదంగా ఇచ్చేది చాక్లెట్లే. తులాభారం కూడా చాక్లెట్లతోనే. అసలీ సంప్రదాయం ఎలా మొదలైందని ఆలయ మేనేజర్ డి.రాధాకృష్ణన్ ను ప్రశ్నిస్తే, 'ఇక్కడ కొలువుదీరిన స్వామి బాల మురుగన్. ఎవరో అనుకుని ఉంటారు, స్వామి చిన్నపిల్లవాడు కదా, చాక్లెట్లను ఇష్టపడతాడని. అలా మొదలై ఉంటుంది' అని చెప్పారు. ఈ విశిష్ట ఆలయానికి విదేశీయులు కూడా పెద్ద పెద్ద బాక్సుల నిండా చాక్లెట్లతో వస్తారట. మురుగన్ శివుడి కుమారుడు. ఇతడికి కార్తికేయ అని మరోపేరు కూడా ఉంది. ఇతనినే మనం కుమారస్వామి అంటాం!