: మా తాతయ్య పేరు వాడొద్దు: రాహుల్ కు మహాత్ముడి మునిమనుమడి సూచన
ఎన్నికల్లో మహాత్ముడి పేరు వాడుకోవద్దని గాంధీజీ మునిమనుమడు శ్రీకృష్ణ కులకర్ణి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సూచించారు. ఈ ఎన్నికలతో తమ తాత గారికేం సంబంధముందని కులకర్ణి ప్రశ్నించారు. మహాత్ముడి హత్యను ఇప్పుడు తిరగదోడాల్సిన అవసరమేమీలేదని హితవు పలికారు. 'ఆయన చనిపోయింది 1948లో, ఆ హత్యపై ఎన్నో కమిషన్లు వేశారు. ఏ సంస్థ ఇందుకు బాధ్యురాలని తేలకపోయినా, ఇద్దరు వ్యక్తులు ఆయన హత్యకు కారకులని తేలింది. ఆయన చనిపోయారన్నది వాస్తవం, ఇక తిరిగిరారన్నదీ వాస్తవం. స్వార్థప్రయోజనాల కోసం ఆయన పేరు తెరపైకి తీసుకురావద్దు' అని కులకర్ణి విజ్ఞప్తి చేశారు.
కులకర్ణి తల్లి గాంధీజీ మూడవ కుమారుడు రాందాస్ తనయ. ఆమె జీఆర్ కులకర్ణిని వివాహమాడింది. కాగా, కులకర్ణి ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు. ఈయన బంధువు రాజ్ మోహన్ గాంధీ తూర్పు ఢిల్లీ నుంచి లోక్ సభ బరిలో ఉన్నారు. ఈయన కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవారే.