: మరోసారి మోడీకి జై కొట్టిన పెద్దన్న
భారత్ లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ విజయం సాధిస్తే స్వాగతిస్తామని అమెరికా స్పష్టం చేసింది. భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగదే అరెస్ట్ తర్వాత భారత్, అమెరికాల దౌత్య సంబంధాలు కొద్దిగా బలహీనపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల సంబంధాల బలోపేతానికి అమెరికా విదేశాంగ శాఖ సహాయమంత్రి నిషా బిశ్వాల్ భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా నిషాబిశ్వాల్ ఒక టెలివిజన్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, మోడీ గురించి మాట్లాడారు.
మోడీతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. భారత్ లో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రతి నేతను తాము ఆహ్వనిస్తామని చెప్పారు. 2002 అల్లర్ల తర్వాత మోడీకి వీసా జారీపై అమెరికా నిషేధం విధించిన విషయం తెలిసిందే. అన్ని ప్రముఖ సర్వేలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు 230కి పైగా స్థానాలు వస్తాయని వెల్లడిస్తున్న నేపథ్యంలో అమెరికా తన ధోరణి మార్చుకుని మోడీ జపం మొదలు పెట్టింది.