: గల్లంతైన మలేసియా విమానంపై తొలగని అనిశ్చితి
నిన్న ఆచూకీ లేకుండా పోయిన మలేసియా ఎయిర్ లైన్స్ విమానం జాడ ఇంకా తెలియరాలేదు. అది కూలిపోయిందా, లేక ఉగ్రవాదులు హైజాక్ చేశారా? అన్న విషయంపై అనిశ్చితి నెలకొంది. విమానం సముద్రంలో కూలిపోయిందనడానికి నిదర్శనంగా సముద్ర జలాలపై ఎలాంటి చమురు ఆనవాళ్ళుగానీ, విమాన శకలాలు గానీ కనిపించలేదు. దీనిపై మలేసియా పౌర విమానయాన అధికారులు విచిత్రమైన రీతిలో స్పందిస్తున్నారు. నిన్న అదృశ్యమైన విమానం తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో ఈ విమానం శుక్రవారం అర్థరాత్రి కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయలుదేరింది. రెండు గంటల తర్వాత ఆ విమానంతో కౌలాలంపూర్ విమానాశ్రయానికి సంబంధాలు తెగిపోయాయి. కాగా, ఆ విమానంలో ఇద్దరు వ్యక్తులు నకిలీ పాస్ పోర్టులతో ప్రయాణిస్తున్నట్టు అధికారులు తెలిపారు. వారిలో ఒకరు ఇటలీ జాతీయుడు కాగా, మరొకరు ఆస్ట్రియా దేశస్తుడు. ఈ నేపథ్యంలో ఉగ్రవాద కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు.