: క్షమాపణలు చెప్పిన కేజ్రీవాల్
కార్యకర్తల తీరుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పారు. నిన్న గుజరాత్ లో పోలీసులు కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకోవడంతో.. రెచ్చిపోయిన ఆమ్ ఆద్మీ కార్యకర్తలు లక్నోలో, ఢిల్లీలో నిరసన ప్రదర్శనలకు దిగి.. బీజేపీ కార్యకర్తలతో తలపడ్డారు. దీంతో వారి ప్రవర్తనకు కేజ్రీవాల్ మన్నించాలని కోరారు. తమపై దాడికి ప్రతీకారంగానే వారు అలా చేసి ఉండొచ్చని.. అయినా వారి ప్రవర్తనకు క్షమాపణ కోరుతున్నానని గుజరాత్ లోని భుజ్ లో కేజ్రీవాల్ ఈ రోజు మీడియాతో చెప్పారు. శాంతియుతంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. మరోవైపు, ఢిల్లీలో దాడులకు సంబంధించి 14 మంది ఆమ్ ఆద్మీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.