: టీమిండియా పరువు పోరాటం నేడే
టీమిండియా వైఫల్యాల బాట వీడడం లేదు. విదేశీ పర్యటనల్లో విఫలమవుతుందని అపవాదు ఉన్న భారత జట్టు ఉపఖండంలో కూడా అదే రకమైన ఆట తీరుతో విమర్శల పాలవుతోంది. పరువు కోసం పోరాడడం, రిక్తహస్తాలతో వెనుదిరగడం టీమిండియాకు పరిపాటిగా మారింది. ఆసియా కప్ ఫైనల్ అవకాశాలను చేజేతులా కాలరాసుకున్న టీమిండియా నేడు పసికూన ఆఫ్ఘన్ జట్టుతో తలపడనుంది.
శ్రీలంక, పాకిస్థాన్ జట్ల చేతిలో ఓటమి కారణంగా ఫైనల్ దారులు మూసుకుపోయాయి. వరుస ఓటములతో ఆత్మస్థైర్యం కోల్పోయిన భారత జట్టుకు, పటిష్టమైన బౌలింగ్ వనరులు కలిగిన ఆఫ్ఘన్ జట్టుకు మధ్య పోరుగా నేటి మ్యాచ్ సాగనుంది. ఓ రకంగా పరువు కోసం రెండు జట్లు పోరాడనున్నాయి. కాగా, ఓడితే టీమిండియా పరువు గంగలో కలిసిపోనుండగా, గెలిస్తే ఆఫ్ఘన్ పరువు ఆకాశమంత ఎత్తు పెరుగుతుంది. దీంతో ఈ ఇరుజట్ల మధ్య పోరాటాన్ని పరువు పోరాటంగా క్రీడా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.