: 'కుక్క కాటుకు చెప్పు దెబ్బ' కొట్టిన చిన్నారి!
తన కుటుంబాన్ని వేధింపులకు గురిచేసిన స్థానిక ఎమ్మెల్యేకి ఓ విద్యార్థిని ఝలకిచ్చింది. అతని చేతుల మీదుగా బహుమతి స్వీకరించబోనని చెప్పుతో కొట్టినట్టు సమాధానమిచ్చింది. వివరాల్లోకెళితే... ఊటీ సమీపంలోని మంజూరు గ్రామంలో జనని అనే విద్యార్థిని టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో 489 మార్కులు తెచ్చుకుంది. ఆమెను అభినందిస్తూ ఆ గ్రామ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు ఓ ప్రోత్సాహక బహుమతి ఇవ్వాలని నిర్ణయించాడు.
ఆ పాఠశాల వార్షికోత్సవం నాడు ఊటీ ఎమ్మెల్యే బుద్ధిచంద్రన్ చేతుల మీదుగా ఆ నజరానా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. బహుమతి అందుకునేందుకు బాలిక పేరు పిలవగానే, జనని పైకి లేచి తన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపి, బహుమతి అందుకునేందుకు నిరాకరించింది. దీంతో, ఎమ్మెల్యే సహా అందరూ షాక్ కు గురయ్యారు. వెంటనే ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన శాసనసభ్యుడు అవమానభారంతో అక్కడినుంచి నిష్క్రమించారు.
ఈ సంఘటనపై జనని తండ్రి సుందరరాజన్ మీడియాతో మాట్లాడుతూ... తన కుమార్తె నజరానా తిరస్కరించడం వెనుక పెద్ద కథ ఉందన్నారు. రెండేళ్ళ క్రితం ఆ ఎమ్మెల్యే బుద్ధిచంద్రన్ తన కుటుంబాన్ని తీవ్రంగా వేధించాడని వెల్లడించారు. ఏఐఏడీఎంకే పార్టీ తరుపున బరిలో దిగిన తన భార్యకు గ్రామస్తులందరూ మద్దతు తెలిపినా, ఆమెను వార్డ్ మెంబర్ గా నామినేట్ చేసేందుకు ఎమ్మెల్యే నిరాకరించాడని తెలిపారు. అంతేగాకుండా తనపై తప్పుడు కేసు బనాయించి జైల్లో తోశారని సుందర్ రాజన్ వాపోయారు.
కేసు వాపసు తీసుకోవాలని తన కుటుంబం వేడుకున్నా బుద్ధిచంద్రన్ కనికరించలేదని పేర్కొన్నారు. అయితే, ఆ కేసును కోర్టు కొట్టివేసిందని, తద్వారా తన నిర్దోషిత్వం వెల్లడైందని చెప్పుకొచ్చారు. ఈ సంఘటనలన్నీ తన కూతురు జనని మనసు గాయపరిచాయని, అందుకే ఆ ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతి అందుకునేందుకు విముఖత చూపిందని సుందరరాజన్ వివరించారు.