: కేసీఆర్ మాట తప్పారు... ప్రజలు గమనిస్తున్నారు: మధుయాష్కీ
టీఆర్ఎస్ తో పొత్తుకు తాము అర్రులు చాచడం లేదని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని కేసీఆరే చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. ఉద్యమ పార్టీగా ప్రజల్లోకొచ్చిన టీఆర్ఎస్... మాట తప్పడాన్ని ప్రజలందరూ గుర్తిస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ ఏర్పడిందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఏ ఒక్కరి విజయం కాదని... అమరవీరుల త్యాగఫలం అని చెప్పారు. ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధనలో కలసికట్టుగా పోరాడిన అందరూ... తెలంగాణ అభివృద్ధికి కూడా కలసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నినాదం 'తెలంగాణ నవనిర్మాణ'మని తెలిపారు.