: కాంగ్రెస్ ను రక్షించేందుకే మూడో ఫ్రంట్ ప్రయత్నం: మోడీ
వచ్చే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మూడో కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ను రక్షించడమే మూడో ఫ్రంట్ లక్ష్యమన్నారు. కేవలం ఎన్నికల ముందే థర్డ్ ఫ్రంట్ ప్రజల ముందుకు వస్తోందని, దాని వల్ల ఎప్పుడూ ప్రయోజనం కలగలేదని ఆరోపించారు. థర్డ్ ఫ్రంట్ వల్ల దేశానికి చాలా ప్రమాదమని హెచ్చరించారు. బీహార్ లోని ముజఫర్ పూర్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న మోడీ ప్రసంగించారు. బీహార్ లో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని తీవ్రవాదులను పరోక్షంగా ప్రశ్నించారు. శాంతి, ఐకమత్యం లేకుండా ఎక్కడా అభివృద్ధి సాధ్యం కాదన్నారు. తీవ్రవాదం ముందు బీహార్ ప్రజలు తలవంచరన్న మోడీ... కావాలంటే తనను, బీజేపీని ఎదుర్కోవాలని... అంతేకానీ అమాయక పౌరులు ఏం చేశారని అడిగారు. దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని సమస్యలకు పరిష్కారం చూపించడమే తన తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు.
బీహార్ లో పంచదార పరిశ్రమను నితీష్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని, నిరుద్యోగం, విద్యుత్ కొరత విపరీతంగా ఉన్నాయన్నారు. నేపాల్ ద్వారా బీహార్ లోకి వచ్చే తీవ్రవాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. బీహార్ లో తీవ్రవాదం వ్యాప్తికి ఓటు బ్యాంకు రాజకీయాలే కారణమన్నారు. పేదల అభివృద్ధికి నిత్యం కృషి చేసేది బీజేపీ ప్రభుత్వాలే అని చెప్పారు. 2022 కల్లా పేదలకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. కాగా, మోడీ ప్రసంగిస్తున్న వేదికపై ఉన్న ఎల్జేపీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ కు, చిరాగ్ కు ఎన్డీఏలోకి మోడీ స్వాగతం పలికారు. వచ్చే దశాబ్దం అంతా దళితుల అభివృద్ధి కోసమేనని, త్వరలో మరిన్ని పార్టీలు ఎన్డీఏలోకి చేరతాయని ధీమా వ్యక్తం చేశారు.