: హైదరాబాదులో లీటర్ పెట్రోల్ 220 రూపాయలు
ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందన్నట్టు పెట్రోలు బంకుల యజమానులు, అధికారుల మధ్య వివాదం వినియోగదారుల జేబుకు చిల్లుపెడుతోంది. దీంతో హైదరాబాదులో లీటర్ పెట్రోలు 220 రూపాయల ధర పలుకుతోంది. తూనికలు, కొలతల శాఖ అధికారులు పెట్రోలు బంకులపై ఆకస్మిక దాడులు చేస్తుండడంతో, పెట్రోలు అమ్మకాల్లో బంకులు పాల్పడుతున్న దోపిడీ పెద్ద ఎత్తున బయటపడింది. దీంతో పెట్రోలు బంకులపై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి.
దీనిని జీర్ణించుకోలేని పెట్రోలు బంకుల యజమానులు తూనికలు, కొలతల శాఖ అధికారులు తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ జంటనగరాల్లో ప్రైవేటు బంకులన్నీ మూసేశారు. పెట్రోలు పోసే మోడల్ అప్రూవల్ విషయంలో చమురు కంపెనీలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి తమను వేధిస్తున్నారంటూ ఆరోపిస్తూ బంకుల యజమానులు గతరాత్రి నుంచి ఆందోళనకు దిగారు. దీంతో జంటనగరాల్లో రాత్రి నుంచి పెట్రోలు బంకులు మూతపడ్డాయి.
దీంతో ప్రభుత్వ బంకుల్లో మాత్రమే పెట్రోలు అందుబాటులో ఉంది. కొన్ని చోట్ల పెట్రోలును బ్లాకులో లీటర్ 220 రూపాయలకు అమ్ముతున్నారు. దీంతో, వినియోగదారుల జేబులకు పెద్ద చిల్లు పడుతోంది. అధికారులు తమపై కేసులు నమోదు చేయమని హామీ ఇచ్చే వరకు బంకులు తెరిచేదిలేదని బంకుల యజమానులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.