: ముగిసిన కల్యాణ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు
తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కన్నుల పండువగా సాగిన కల్యాణ వేంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసాయి. గురువారం నాడు జరిగిన ధ్వజావరోహణం కార్యక్రమంతో ఈ ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు వివిధ వాహనాలపై తిరువీధుల్లో విహరించిన స్వామివారిని దర్శించి అశేష భక్తజనులు తరించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం, రాత్రి వాహన సేవలు వైభవంగా జరిగాయి. ఈసారి రథోత్సవంలో స్వామివారిని స్వర్ణరథంపై ఊరేగించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని ఆలయ పుష్కరిణికి తీసుకొచ్చారు. తిరుమంజన మండలంపై కొలువైన స్వామి వారికి సతీసమేతంగా స్నపన తిరుమంజనసేవ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో వివిధ వాహనాలపై విహరించిన స్వామివారు అలసిపోతారు. అలసిన స్వామివారికి ఉపశమనం కోసం పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. చక్రస్నానం సమయంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో భాస్కర్, ఆలయ డిప్యూటీ ఈవో, ఏఈవో తదితర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.