: పాకిస్తాన్ వైఖరిలో ఎంత మార్పు...!
తీవ్రవాదంపై పోరు పట్ల పాకిస్తాన్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో మిలిటెంట్లపై ఉక్కుపాదం మోపుతున్న దాయాది తొలిసారిగా దేశంలో ఉగ్రవాద వ్యతిరేక విధానాన్ని ప్రవేశపెట్టింది. తాలిబాన్లు, ఇతర టెర్రరిస్టు గ్రూపులకు ఆవాసయోగ్యంగా మారిన పాకిస్తాన్ ఉగ్ర ఫలితాలను దారుణ రీతిలో చవిచూసింది. దేశంలో తీవ్రవాద దాడుల సంఖ్య నానాటికి పెరిగిపోతుండడం పట్ల పాక్ సర్కారు కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో జాతీయ భద్రత విధానానికి పార్లమెంటు ఆమోదం తెలిపింది. తాజా పాలసీని అనుసరించి తీవ్రవాద స్థావరాలపై మున్ముందు మరిన్ని దాడులు నిర్వహిస్తామని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి చౌధరీ నిసార్ అలీ ఖాన్ వెల్లడించారు.
తాలిబాన్ల అదుపులో ఉన్న 23 మంది సైనికులను చంపినట్టు వార్తలు రాగానే, తాలిబాన్లతో చర్చలుండవని పాక్ ప్రభుత్వం ఈ నెల మొదటివారంలో ప్రకటించింది. అప్పటి నుంచి పాక్ వైమానిక దళం ఆఫ్ఘన్ సరిహద్దులోని వజీరిస్తాన్ ప్రాంతంలో ఉన్న తీవ్రవాద శిబిరాలపై పెద్ద ఎత్తున దాడులు చేసి భారీ సంఖ్యలో మిలిటెంట్లను మట్టుబెట్టింది.