: పిల్లాడు కాదు పిడుగు
కలర్స్ ఛానెల్ లో ప్రసారమయ్యే ఇండియా గాట్ టాలెంట్ ప్రోగ్రామ్ చూసే వారికి అక్షత్ బాగా పాప్యులర్. అక్షత్ డ్యాన్స్ చూసి డంగవ్వని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. అక్షత్ కు ఎనిమిదేళ్లే కానీ బీట్ కు తగ్గట్టు అతడు చేసే మూమెంట్స్, ప్రదర్శించే ఎక్స్ ప్రెషన్స్ అంటే అభిమానులు పడిచస్తారు. ఈ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమాలో మేరా హి జల్వా పాటకు చేసిన డ్యాన్స్ తో అతడి పేరు మారుమోగిపోయింది. ఈ పాటను కలర్స్ వాళ్లు యూట్యూబ్ లో పెట్టారు. దీంతో అతడి డ్యాన్స్ కు లక్షల కొద్దీ లైకులు వచ్చాయి.
అతడికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా అక్షత్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయాడు. అమెరికన్ ఛానెల్ లో ప్రసారమయ్యే 'ది ఎలెన్ డీజెనెరస్ షో'లో పాల్గొన్నాడు. షూటింగ్ పూర్తైంది కానీ ఇంకా ప్రసారం కాలేదు. చిన్నారులకు సంబంధించిన ఆ షోలో అక్షత్ చేసిన అల్లరిని చూడొచ్చు. షో నిర్వాహకురాలు తన ప్రదర్శనను చూసి సల్మాన్ ఖాన్ గురించి చెప్పమని అడిగారని అక్షత్ చెప్పాడు. అక్షత్ తన ఫాలోయింగే కాకుండా తన అభిమాన నటుడి ఫాలోయింగ్ కూడా పెంచేశాడు.