: మోడీపై సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై యూపీఏ నేతల వ్యాఖ్యలు తారస్థాయికి చేరుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని తన లోక్ సభ నియోజకవర్గం ఫరూఖాబాదులో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఖుర్షీద్ ప్రసంగిస్తూ, "నీకు నీవుగా ఒక బలమైన, శక్తిమంతమైన వ్యక్తి అని చెప్పుకున్నావు. అయితే, నువ్వు ప్రధాని కావాలని నేను కూడా ఆకాంక్షిస్తున్నాను. కానీ, గోద్రా ఘటన నుంచి నీవు ప్రజలను రక్షించలేకపోయావు. ఎవరో వచ్చి దాడి చేసి వెళ్లారు. బాధితులను కాపాడలేకపోయావు. నీవు బలమైన వ్యక్తివి కావా?.. ప్రజలను రక్షించనందుకు ఆరోపించడం లేదు. కానీ, నువ్వు 'నపుంసకుడివి'" అని ఎక్కడా మోడీ పేరు ప్రస్తావించకుండా ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. వెంటనే ఈ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. కాంగ్రెస్ సంస్కారం, సభ్యతను విడిచి ఈ విధంగా ప్రవర్తిస్తోందని ఆ పార్టీ నేత షానవాజ్ హుస్సేన్ మండిపడ్డారు. విదేశాల్లో చదువుకున్న ఖుర్షద్ భారతీయ విలువలను మర్చిపోకూడదని సూచించారు.