: మరో మూడు రోజుల్లో ముగియనున్న సీఎస్ మహంతి పదవీకాలం
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రేపు జరగనున్న కేంద్ర హోం శాఖ సమావేశంలో విభజన తేదీ గురించి చర్చించే అవకాశం ఉంది. అలాగే, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి రేపు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఈ నెల 28వ తేదీతో మహంతి పదవీ కాలం ముగియనుంది. అనంతరం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) గౌరవ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పదవీ విరమణకు ముందుగా సీసీజీ గౌరవ అధ్యక్షునిగా తనను నియమించుకుంటూ సీఎస్ హోదాలో మహంతి ఉత్తర్వులు జారీ చేయనున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ అంతా సీజీజీలోనే జరుగనుంది. రాష్ట్ర విభజన సమాచారాన్ని కేంద్రప్రభుత్వానికి చేరవేయడం, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడంతో మహంతితో పాటు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు కీలక పాత్ర వహించారు. విభజన తర్వాత పంపిణీలోనూ వీరిరువురూ కీలక భూమిక పోషించనున్నారు.